అలా చేసుంటే మణికొండలో సగం కొనేసేవాడిని: 'చిత్రం' శ్రీను

  • 'చిత్రం' సినిమాతో పరిచయమైన శ్రీనివాసులు 
  • అప్పట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేదని వెల్లడి 
  • డబ్బులు చాలా వృథా చేశానంటూ వివరణ 
  • జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరమని వ్యాఖ్య  
'చిత్రం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాసులు, ఆ తరువాత 'చిత్రం' శ్రీనుగా పాప్యులర్ అయ్యాడు. ఎన్నో సినిమాలలో తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను చేస్తూ వచ్చాడు. ఆయన తాజా చిత్రంగా వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రీను ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. తన స్నేహితుడైన వేణు దర్శకత్వంలో నటించడం తనకి ఎంతో గర్వంగా ఉందని చెబుతున్న శ్రీను, తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు.

"నేను ఎప్పుడూ డబ్బును డబ్బుగా చూడలేదు. స్నేహతులకు .. పార్టీలకు విపరీతంగా ఖర్చు చేశాను. ఆ రోజున నేను గనుక డబ్బును పొదుపు చేసుంటే, మణికొండలో సగం కొనేసి ఉండేవాడిని. అప్పట్లో రోజుకి నాలుగైదు సినిమాలలో చేసేవాడిని. అప్పుడున్న రేటుకి .. నాకు వచ్చిన డబ్బుకి సగం మణికొండను కొనేసి ఉండేవాడిని. అవకాశాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయనీ .. డబ్బులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయని అనుకున్నాను. అది కరెక్ట్ కాదనే విషయం అర్థం కావడానికి కొంత సమయం పట్టింది" అని అన్నాడు.

 "నేను చాలా మంచి ఆర్టిస్టును .. ఎప్పుడూ బిజీగానే ఉంటాను ..  జూబ్లీ హిల్స్ లో ఇల్లు కొంటాను అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ నాలో బలంగా ఉండేది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనే ఒక విషయం ఆ తరువాతనే నాకు తెలుస్తూ వచ్చింది. సినిమాలు తగ్గినప్పుడు ఈవెంట్స్ నన్ను ఆదుకున్నాయి. అందుకు నా స్నేహతులు చాలా హెల్ప్ చేశారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ .. ముందుచూపు అవసరమనే విషయం మాత్రం నాకు అర్థమైంది" అని చెప్పాడు.


Chitram Seenu
Telugu Actor
Manikonda
Tollywood News
Chitram Seenu Interview
Ellamma Movie

More Telugu News